కరోనా విలయం కారణంగా దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శవాలను దహనం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ లేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిల్లీలో శ్మశాన వాటికల సంఖ్యలను అత్యవసరంగా పెంచాలని ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్లను హైకోర్టు ఆదేశించింది. వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఈ విషయంపై న్యాయవాది సనిగ్ధ సహకారంతో ప్రత్యూష్ ప్రసన్న దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జస్మీత్ సింగ్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి వాదనలను మే 17కు వాయిదా వేసింది.
కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలు గౌరవంగా నిర్వహించాలని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. మృతులను శ్మశాన వాటికలకు చేర్చేందుకు వాహనాలు, దహనం చేసేందుకు కలప, అంతిమ యాత్రలో పాల్గొనే కుటుంబ సభ్యులకు పీపీఈ కిట్లు అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని కోరారు. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, స్టేడియం, ఇతర ప్రదేశాల్లో దహన సంస్కారాలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలక్ట్రిక్ క్రిమేషన్ కేంద్రాలను కూడా పెంచాలని సూచించారు.
ఇదీ చూడండి: అడ్రస్ మారిన మృతదేహం- అంత్యక్రియలయ్యాక వెలుగులోకి..