ప్రేమ అంటే ఓ మాయ! అందులో ఉన్నంత సేపు ప్రేమికుల మాటలు తప్ప ఇంకెవరి మాటలు వినపడవు! అందుకేనేమో.. ఓ ప్రేమికురాలు తన ప్రియుడు చెప్పాడని.. గంజాయిని విక్రయించడానికి కూడా వెనకాడలేదు. చివరకు కర్ణాటక బెంగూళురులోని సదాశివనగర్ పోలీసులకు చిక్కి.. కటకటాల పాలైంది. ఇక స్టోరీలోకి వెళ్తే..
కళాశాలలో మొదలైన ప్రేమాయణం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేణుక, కడప జిల్లాకు చెందిన సిద్ధార్థ్.. చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడి.. అది ప్రేమ వరకు వెళ్లింది. ఇంజినీరింగ్ పూర్తి అయిన తర్వాత రేణుక తన ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పింది. అయితే ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో ఇంటి నుంచి చెన్నై వెళ్లిపోయిన రేణుక.. అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది. మరోవైపు చదువు ముగించుకొని ఇంటికి వెళ్లిన సిద్ధార్థ్.. తన సరదాల కోసం గంజాయి అమ్మడం ప్రారంభించాడు.
కొత్త వ్యాపారం.. కాసుల వర్షం అంటూ..
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత రేణుకకు ఫోన్ చేసి.. తాను కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు సిద్ధార్థ్. అందుకు సాయం చేస్తే రూ.లక్షల్లో సంపాదించవచ్చని చెప్పాడు. దీంతో రేణుక ఉద్యోగం వదిలేసి.. నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. గంజాయి అమ్మడం ప్రారంభించింది.
అయితే లాక్డౌన్లో తన ప్రియుడి కోరిక మేరకు బెంగళూరు వెళ్లింది. అక్కడే బిహార్‌కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారి సుధాన్షును రేణుకకు పరిచయం చేశాడు సిద్ధార్థ్. మరోవైపు సిద్ధార్థ్.. విశాఖపట్నం, ఒడిశాలలో గంజాయిని కొని, చిన్న ప్యాకెట్ల రూపంలో బెంగళూరుకు పంపిస్తుండేవాడు.
అయితే సదాశివనగర్‌లో గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో.. ఇన్స్పెక్టర్ అనిల్ కూమార్ నేతృత్వంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే రేణుకా.. పోలీసులకు పట్టుబడింది. అయితే సిద్ధార్థ్, సుధాన్షులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 50 గ్రాముల గంజాయిని రూ.2000 నుంచి 3000 వరకు రేణుక విక్రయించేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: యువకుడి చేతులు కట్టేసి.. చితకబాదుతూ వీడియో తీసి...