జమ్ముకశ్మీర్ సోపోర్ పట్టణంలోని గంద్‌బ్రాత్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో లష్కర్ ఏ తోయిబాకు చెందిన ప్రముఖ ఉగ్రవాది ముదాసిర్ పండిత్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గంద్‌బ్రాత్ ప్రాంతంలో ముదాసిర్ పండిట్ సహా మరికొందరు తీవ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. తప్పించుకునే ప్రయత్నంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులకు దిగినట్లు తెలిపారు. ఇంకొంత మంది ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
మోస్ట్ వాంటెడ్..
పాకిస్థాన్ జాతీయుడైన ముదాసిర్.. భారత్‌లో ఇదివరకు పలు దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్ 12న సోపోర్ పోలీసులపై జరిగిన దాడిలో ముదాసిర్ ప్రధాన నిందితుడని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందారని వివరించారు.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మరో తీవ్రవాది పాకిస్థాన్‌కు చెందిన అస్రార్ అలియాస్ అబ్దుల్లాగా గుర్తించారు.
ఇదీ చదవండి: నరబలి కోసం బాలిక అపహరణ!