అడవుల్లో తమకు నచ్చిన ఆహారాన్ని తింటూ.. సరదాగా ఉండాల్సిన ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అప్పుడప్పుడు రాత్రిళ్లు హల్చల్ చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే థాయిలాండ్‌లోని హువా హిన్ ప్రాంతంలో ఓ ఇంటి గోడను పగులగొట్టి.. కిచెన్‌లోకి దూరింది ఓ ఏనుగు. ఇంకేముంది దొరికినంతవరకు తొండంతో అందుకుని కడుపునిండా ఆరగించి.. అక్కడి నుంచి జారుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సందు చూసి..
ఇంట్లోవారంతా మంచి నిద్రలో ఉండగా.. కిచెన్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో నిద్రలేచిన రాట్చాదావన్.. భర్తను లేపింది. ఇద్దరూ కలిసి.. ఏమైందని చూసేసరికి ఏనుగు తల కనిపించింది. స్నాక్స్ ఉన్న ప్లాస్టిక్ సంచిని తొండంతో అందుకుని తింటుంది. ఈ సంఘటన చూసి దంపతులు మిన్నకుండిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు.. బాధిత కుటుంబాన్ని సందర్శించారు. ఉప్పుగా ఉన్నటువంటి స్నాక్స్ వంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచకూడదని సూచించారు. శిథిలాలను తొలగించిన అధికారులు.. మరమతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. వర్షాకాలం అయినందున ఉప్పుగా ఉన్న ఆహారం కోసం ఏనుగులు తరచూ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న గజరాజును అరణ్యంలోకి పంపారు.
అయితే.. తమకు ఇదేం కొత్తకాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా?