Electric bike catches fire while charging: దేశంలో పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్న క్రమంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల నుంచి కార్లు, బస్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వాటిని ఛార్జింగ్ చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగటం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఓ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది.
దగ్ధమైన బైక్..
శివమొగ్గ జిల్లా భద్రావతి తాలుకలోని నిందిగొండి గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ మంటలు చెలరేగి కాలిబూడిదైంది. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని కొబ్బరితోటలో రాత్రి ఛార్జింగ్ పెట్టారు. ఓ గంట తర్వాత బైక్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు మల్లికార్జున్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జ్వాలల్లో పూర్తిగా దగ్ధమైంది. ఆ పక్కనే ఉన్న ఓ మంచం కూడా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. దగ్ధం