వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సోమవారం విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ ఏడాది మహమ్మారి నేపథ్యంలోనూ బిహార్, బంగాల్ సహా మరో 4 అసెంబ్లీలకు పోలింగ్ నిర్వహణతో తగిన అనుభవం సంపాదించినట్లు తెలిపారు.
"శాసనసభ గడువు ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించడం, గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్కు పంపడం ఎన్నికల కమిషన్ ప్రధాన విధి."
- సుశీల్ చంద్ర, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్
గోవా, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభ గడువు 2022 మార్చితో ముగియనుండగా.. యూపీ అసెంబ్లీ వ్యవధి మేతో పూర్తి అవుతుంది.
కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా పలు రాజ్యసభ ఉపఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై స్పందిస్తూ.. కొవిడ్ తీవ్రత, కేసులు తగ్గుతున్నాయని.. మహమ్మారి సమయంలోనూ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తాము పూర్తి అవగాహన సంపాదించినట్లు సుశీల్ చంద్ర తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ మీటింగ్లో దీదీ తీరుపై కేంద్రం గుస్సా