Assembly elections EC new rules: కరోనా ఉద్దృతి కొనసాగుతున్న క్రమంలో.. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 11 వరకు నిషేధం పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే.. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది.
అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలు కొనసాగింపుపై చర్యలు కొనసాగించాలని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది ఈసీ. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు, ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ కార్యకలాపాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని పలు కీలక సూచనలు చేసింది.
ఈసీ తీసుకున్న కీలక నిర్ణయాలు..
- ఫిబ్రవరి 11, 2022 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్/వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం పొడిగింపు.
- బహిరంగ సభల్లో 500 మందికి మాత్రమే ఉన్న పరిమితిలో సడలింపు. గరిష్ఠంగా 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి.
- ఇండోర్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 300 మంది నిబంధన సడలించి గరిష్ఠంగా 500 మందికి అనుమతి.
- ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంపు. ఇంతకు ముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంపు.
- రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల సమయంలో అన్ని సందర్భాలలో కరోనా నిబంధనలతో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: తల్లిదండ్రులు ఓటు వేస్తే.. పిల్లలకు 10 మార్కులు బోనస్!