ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు భాగస్వామ్య సంస్థలతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్‌లో విద్య' కార్యక్రమం అమలుతీరుపై చర్చించింది. దీన్ని త్వరలోనే సవరించి.. అవసరమైన మౌలిక వసతులు కలిగి, నాణ్యమైన విద్యను అందించే మరిన్ని సంస్థలకు ప్రవేశం కల్పించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్ ఖరే తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల మధ్య ఎలాంటి తేడాను చూపబోమని అమిత్ చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులకు అనువైన వాతారణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఆ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి హాస్టళ్లను సిద్ధం చేయాలని భాగస్వామ్య విద్యా సంస్థలకు సూచించారాయన. అంతర్జాతీయ విద్యార్థుల అవసరాలన్నీ తీర్చేలా 'ఏక గవాక్ష కేంద్రం'గా అది ఉండాలన్నారు. విదేశీ విద్యార్థులకు ప్రభుత్వంలోని సంబంధిత శాఖల్లో ఇంటర్న్‌షిప్‌లను అనుమతించే అంశంపైనా దృష్టిసారించామని చెప్పారు.
'భారత్‌లో విద్య' కార్యక్రమం కింద దేశంలోని ఉన్నత విద్య సంస్థల్లోకి విదేశీ విద్యార్థులను ఆకర్షించడం ప్రభుత్వ ఉద్దేశం. 2018లో దీన్ని ప్రారంభించారు. ఉమ్మడి పోర్టల్ ద్వారా ప్రతిభ ప్రాతిపదికన ప్రవేశాలను కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ 50 దేశాలకు చెందిన 7500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్ రేప్- దోషులకు 20 ఏళ్ల జైలు