బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(abhishek banerjee tmc)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. సెప్టెంబర్ 6న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అభిషేక్ భార్య రుజిరా బెనర్జీకి(abhishek banerjee wife) సైతం సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 1న హాజరు కావాలని రుజిరా బెనర్జీకి స్పష్టం చేసింది. బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో వీరిరువురిని ఈడీ ప్రశ్నించనుంది.
ఈ కేసులో రుజిరను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. తాజాగా ఈడీ(enforcement directorate) నోటీసులు పంపింది. పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన ఓ న్యాయవాదికి సైతం సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు.
తాజా నోటిసులపై అభిషేక్ బెనర్జీ స్పందించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈడీని ఉపయోగించుకొని భాజపా ఒత్తిడి పెంచాలని అనుకుంటోందని.. అయితే తాము అంతే బలంగా పుంజుకుంటామని పేర్కొన్నారు.
మమత ఫైర్
అభిషేక్‌కు ఈడీ సమన్లపై టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "కేంద్రం మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది. బొగ్గు మాఫియాతో కుమ్మక్కయింది భాజపా మంత్రులే. బంగాల్ ఎన్నికల సమయంలో బొగ్గు మాఫియాకు సంబంధించిన వ్యక్తుల హోటళ్లలోనే భాజపా మంత్రులు బస చేశారు. మీరు మాపైకి ఈడీని పంపిస్తే.. భాజపా నేతలకు వ్యతిరేకంగా మేము సాక్ష్యాలు పంపిస్తాం. ఇలాంటి కక్షసాధింపు ప్రభుత్వాన్ని నా రాజకీయంలో ఎన్నడూ చూడలేదు" అని మండిపడ్డారు మమత.
నవంబర్‌లో సీబీఐ కేసు
గతేడాది నవంబర్‌లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లి. జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీలను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్‌కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది. కాగా, ఈ అక్రమ వ్యాపారం నుంచి అభిషేక్ బెనర్జీ ఆర్థిక ప్రయోజనం పొందారన్నది ఈడీ వాదన. దీన్ని అభిషేక్ ఖండిస్తున్నారు.
ఇదీ చదవండి: Viral Video: నడిరోడ్డుపై తుపాకీతో యువకుడి వీరంగం