ED Investigate TSPSC Paper Leakage Case: రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ కేసును దర్యాప్తు చేపట్టేందుకు ఈడీ రంగంలోకి దిగబోతుంది. అయితే ప్రస్తుతం ఈ కేసుల విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ ద్వారా కొనసాగుతోంది. ఈ కేసును మొదట బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయగా.. ఆ తర్వాత సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పలుమార్లు విచారించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులను ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారాయనే మొదటి నుంచి ఆరోపణలు రావడంతో.. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేయబోతుంది.
TSPSC Paper Leakage Case update : టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా.. ఐదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్.. తన స్నేహితురాలు రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ఇచ్చి ప్రతిఫలంగా 10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.
ED Investigate Data Theft Cae: ఆమె, తన భర్త డాక్యానాయక్‌తో కలిసి మరో ఐదు మందికి అమ్మి.. రూ. 25లక్షల వరకు సంపాదించినట్లు సిట్ అధికారులు విచారణలో తెలుసుకున్నారు. వీరే కాకుండా ఇంకా మరికొంత మందికి ప్రశ్నాపత్రం అమ్మి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే గ్రూప్-1కు సంబంధించిన లావాదేవీల వివరాలు పూర్తిస్థాయిలో తెలియకపోవడంతో.. ఈడీ రంగ ప్రవేశం చేయనుంది. తాజాగా ఇలాంటి చోటు చేసుకోవడం ప్రస్తుత రాష్ట్రంలో చర్చనీయాంశంలో మారింది.
అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లుగానీ, ఆస్తులు సమకూర్చుకున్నట్లుగానీ ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం-పీఎమ్‌ఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. ఇప్పుడు ఈడీ దీని ఆధారంగానే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కేసును నమోదు చేసి.. తనదైన శైలిలో విచారించనుంది. కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నుంచి గానీ, న్యాయస్థానం నుంచి గానీ ఎఫ్‌ఐఆర్ పొంది.. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఈసీఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అరెస్టయిన నిందితులను మరోసారి విచారించనుంది. అవరసరమైతే వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
వ్యక్తిగత డేటా చోరీ కేసులో రంగంలోకి దిగనున్న ఈడీ: సంచలనంగా మారిన వ్యక్తిగత డేటా చోరీ కేసును సైతం ఈడీ దర్యాప్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ముఠాను ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అందులో ఇంకా ఎంత మంది ఉన్నారు.. వారు దొంగలించిన సమాచారం ఎవరికీ అమ్మారు అనే కోణంలో విచారించారు. అయితే ఈ చోరీలో రక్షణ శాఖకు చెందిన ఉద్యోగుల సమాచారం ఉండటంతో.. ఈడీ దర్యాప్తును జరపనుంది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు గుర్తించి.. ఈడీ విచారణను చేపట్టనుంది. ఈ చోరీ వెనుక ఉగ్రకోణం ఉందా అనే ప్రశ్నలు దర్యాప్తు సంస్థలను వేధిస్తున్నాయి. ఈ కేసులో ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: