మట్టిలో కలిసిపోదు. నీటిలోనూ ఇంకిపోదు. అలాగే ఉంచితే ఆరోగ్యానికి ముప్పు. కాల్చితే ఇంకా ప్రమాదం. ప్లాస్టిక్ గురించే ఇదంతా. దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత ప్లాస్టిక్ సంచులను తయారు చేసింది మైసూర్‌లోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ. ఈ సంచులు 180 రోజుల్లోనే భూమిలో కలిసిపోతాయని తెలిపారు పరిశోధకులు. ఈ సంచిలో 5కిలోల బరువున్న వస్తువులను తీసుకెళ్లవచ్చని వెల్లడించారు.
ఈ సంచులను సహజంగా లభించే పాలీ లాక్టిక్ యాసిడ్ పాలీపెట్ నుంచి తయారు చేశారు. అదే సాంకేతికతతో లంచ్ ప్లేట్లు, స్పూన్లు, ఆహార వినియోగానికి వాడే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ సంచుల తయారీకి డా.ఝాన్సీ పాల్, డా.పాల్ మురగన్ ఆధ్వర్యంలో 5 ఏళ్లు కష్టపడింది 15మంది శాస్త్రవేత్తల బృందం.
సాధారణంగా వస్త్రంతో తయారు చేసే సంచి ధర రూ.10 నుంచి రూ.15 రూపాయలు ఉంటుంది. డీఎఫ్‌ఆర్‌ఎల్ తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ ధర కేవలం రూ.2 అని పరిశోధకులు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాముండి కొండకు 5,000 సంచులను పంపిణీ చేశామని అన్నారు. అలాగే శ్రీకంఠేశ్వర ఆలయం, శ్రీ రంగపట్టణ ఆలయంలో కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: బైక్‌పై హెల్మెట్ లేకుండా ఎమ్మెల్యే, మంత్రి.. రూ.1,000 ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్
'శివసేన బాలాసాహెబ్'గా శిందే వర్గం.. రెబల్ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు