EC Transfers Several Collectors and SPs in Telangana : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ పలు జిల్లాల కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇటీవల హైదరాబాద్‌లో సమీక్ష అనంతరం అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గత అనుభవాలు, తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఈసీ అధికారులను బదిలీ చేసింది. డబ్బు, మద్యం, ఇతరత్రాల పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిలపై ఈసీ బదిలీకి ఆదేశించింది. అలాగే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు(EC Directives) జారీ చేసింది.
అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్న ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ(Commercial Taxes Department)లకు విడిగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని స్పష్టం చేసింది. ఆయా స్థానాల్లో కొత్త అధికారుల నియామకం కోసం గురువారం సాయంత్రంలోగా ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను సీఈఓ ద్వారా ఈసీకి పంపాల్సి ఉంటుంది. కాగా.. అందులో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది.
EC Focus on Telangana Assembly Elections : ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు(Central Election Commission Officials) పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ.. వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు వచ్చిన వారిపై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.
Election Commission Officials Visits Telangana : మరోవైపు రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసు శాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు(EC Officials) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎస్పీలను బదిలీ చేస్తు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.