ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections 2020) ఉపయోగించిన ఈవీఎంలు, వీవీపాట్ యంత్రాలను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును(Supreme Court) ఎన్నికల సంఘం ఆశ్రయించింది(ec moves sc). ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరింది. కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై వివిధ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈవీఎంలు, వీవీపాట్ యంత్రాలను భద్రపరుస్తున్నట్లు తెలిపింది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలు(Assmebly elections 2021) సమీపిస్తుండటం వల్ల ఈవీఎం యంత్రాలు అవసరమవుతాయని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల కోసం వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. వచ్చే వారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
కొవిడ్ రెండో వ్యాప్తి సమయంలో జరిగిన ఎన్నికలపై పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం.. ఏప్రిల్ 27న కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలు చేసే పిటిషన్ల కాలపరిమితిని సడలించింది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపర్చాలని ఆదేశించింది. ఇతర ఎన్నికల్లో ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ ఆదేశాల వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలను ఈసీ ఉపయోగించుకోలేకపోతోంది. వచ్చే ఏడాది కీలకమైన యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తాజాగా ఈ విషయంపై సుప్రీంను ఆశ్రయించింది.
ఇదీ చదవండి: రైలు ఢీకొని ఒకే కుటుంబంలో నలుగురు మృతి