కొవిడ్ విజృంభణ నేపథ్యంలో బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని సూచించింది. బంగాల్‌లో ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తికాగా.. మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రోడ్ షోలు, సైకిల్/ బైక్/ ఇతర వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే వాటిని ఉసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బెంగాల్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈసీ ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.
రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్లుగా మారవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోల్‌కతా హైకోర్టు గురువారం విచారించింది. ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ ఎన్నికల సంఘం అధికారులు రేపటి విచారణలో నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.
ఇదీ చదవండి:వైరస్ మృత్యుఘంటికలు- ఆక్సిజన్ అందక విలవిల