Andaman earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూమి కంపించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం ఉదయం 7.02 గంటలకు భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్ తీరానికి సమీపంలో భూప్రకంపనలు వచ్చాయని జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని తెలిపింది. క్యాంప్బెల్లో మూడు రోజుల క్రితమే ఓ భూకంపం వచ్చింది. ఏప్రిల్ 6న 4.4 తీవ్రతతో భూమి కంపించింది.
Gujarat Earthquake: గుజరాత్‌లోని కచ్‌లోనూ భూకంపం సంభవించింది. 3.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై సమాచారం లేదని చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. జిల్లాలోని రాపార్కు సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఇది.. గత నెల రోజుల వ్యవధిలో 3 కన్నా అధిక తీవ్రతతో వచ్చిన ఐదో భూకంపం కావడం గమనార్హం. రాపార్, ధుధాయ్, లఖ్పథ్ ప్రాంతాల్లో ఇదివరకు భూకంపాలు సంభవించాయి.
Earthquake news today: మరోవైపు, ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని యమనా ఘాటి నుంచి బార్కోట్ వరకు, పురోలా నుంచి యమునోత్రి వరకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. శనివారం సాయంత్రం 4.52 గంటలకు భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రకంపనలు రాగానే ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దోపిడీ కోసమే 'రైత్వారీ'.. రైతులను దారుణంగా హింసించి...