సాధారణంగా ఎవరైనా.. రోడ్డు మీద డబ్బులు దొరికితే జేబులో వేసుకుని వెళ్లిపోతారు. అదే.. ఓ బ్యాగ్‌లో రూ.25 లక్షలు దొరికితే మీరేం చేస్తారు?.. అక్కడే వదిలేస్తారా?.. తీసుకెళ్లిపోతారా?.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రిక్షావాలా మాత్రం తనకు దొరికిన రూ.25 లక్షలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులకు అందించి నిజాయితీ చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..
గాజియాబాద్‌లోని మోదీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన మహ్మద్.. మంగళవారం తన ఈ-రిక్షాపై వెళ్తున్నాడు. అదే సమయంలో అతడికి రూ.25 లక్షలు ఉన్న బ్యాగ్ దొరికింది. వెంటనే మరో వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతడి దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు డబ్బుల బ్యాగ్‌ను అహ్మద్ అందించాడు. అతడి నిజాయితీని మెచ్చి.. పోలీసులు మహ్మద్‌ను సత్కరించారు.
అయితే ఈ డబ్బు అంతా ఎవరిదనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించామని రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. అంత భారీ మొత్తాన్ని చూసిన తర్వాత ఎవరి మనసులోనైనా అత్యాశ వచ్చేదేమో. కానీ మహ్మద్.. డబ్బును పోలీసులకు అప్పగించడం చుట్టుపక్క ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.