Churu Youth Mobile addiction: ప్రస్తుతం యువత మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక దొరికినా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇలానే.. మొబైల్ వినియోగానికి అతిగా అలవాటుపడిన ఓ యువకుడు.. చివరికి మానసిక రోగిలా మారిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.
ఏమైందంటే..?
రాజస్థాన్, చూరు ప్రాంతానికి చెందిన అక్రమ్(20)కు ఫోన్ అలవాటు అధికంగా ఉండేది. మొబైల్ వినియోగిస్తూ.. రాత్రుళ్లు నిద్రపోవటం కూడా మానేశాడు.
" ఎప్పుడూ మొబైల్ వాడుతూనే ఉంటాడు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకు అలా ఫోన్ చూస్తూనే ఉంటాడు. నా భార్యతో చాట్ చేస్తున్నా అంటాడు. ఏమీ తినడు, తాగడు కేవలం అలా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపట్టడం లేదు. ఆహారం ఇచ్చినా తీసుకోవడం లేదు. పరిస్థితిని గమనించిన డాక్టర్లు.. బాధితుడిని ఎమర్జెన్సీ వార్డ్‌లో చేర్చాలని సూచించారు. చికిత్స అందిస్తుంటే కూడా ఫోన్ కావాలని అడుగుతున్నాడు."
- ఆర్బాజ్, బంధువు
కొద్దిరోజుల తర్వాత అక్రమ్.. వింతగా ప్రవర్తించడాన్ని అతడి తల్లిదండ్రులు గుర్తించారు. అక్రమ్‌ను చూరులోని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. నిద్రలేకపోవడం కారణంగా.. అక్రమ్ మానసిక రోగిగా మారాడని, అతని ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
" ఎక్కువగా ఫోన్ చూస్తుండటం వల్ల నిద్ర సమస్యలు ఎదురవుతాయి. దీంతో కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. క్రమంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది."
- జితేంద్ర కుమార్, మానసిక వైద్యుడు
అక్రమ్‌కు 8నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయిందని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఎప్పుడు చూసినా ఫోన్‌తోనే సమయం గడిపేవాడన్నారు. ఐదురోజులుగా అతడి ప్రవర్తనలో మార్పులు గమనించామన్నారు. అక్రమ్ వింత చేష్టలకు ఒక్కోసారి భయబ్రాంతులకు గురయ్యామని తల్లిదండ్రులు వాపోయారు.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పిల్లర్.. ఎక్కడంటే?