Husband Harassing Wife : డ్రగ్స్ పార్టీకి స్నేహితులను ఇంటికి పిలిచి.. మాదక ద్రవ్యాల మత్తులో కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. స్నేహితులు భార్యతో వెకిలి చేష్టలు చేస్తే.. వారికి సహకరించమని భార్యకు చెప్పేవాడు. దీనికి అతడి సోదరుడు కూడా వత్తాసు పలికాడు. తన భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్.. కాకినాడకు చెందిన అఖిలేశ్.. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం అతడికి పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్న సమయంలో.. మాట్రిమోనీ వెబ్సైట్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అనుమతించాయి. దీంతో 2019లో వీరిద్దరు వివాహం చేసుకుని.. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు.
Husband Harassment : పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ బాగానే ఉండేవారు. కానీ అఖిలేశ్ డ్రగ్స్‌కు బానిసైన.. ఇంటికి మాదకద్రవ్యాలు తెచ్చి తాగేవాడు. ఆ మత్తులో భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అలా కొన్ని రోజుల గడిచిన తర్వాత.. స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి.. డ్రగ్స్ పార్టీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ తీసుకోమని భార్యను బలవంతం చేసేవాడు. డ్రగ్స్ మత్తులో అతడి స్నేహితులు తన భార్యను తాకి.. అసభ్యంగా ప్రవర్తించినా.. అఖిలేశ్ ఏమీ మాట్లాడకుండా వారికి సహకరించాలని చెప్పేవాడు. అలా రోజురోజుకు వేధింపులు పెరిగిపోయాయి. ఇంతే కాకుండా తన భార్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను కూడా మొబైల్ ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించాడు నిందితుడు.
భర్త వేధింపులు భరించలేక బాధితురాలు తన పుట్టింటికి వెళ్లింది. దీంతో తన భార్యను ఇంటికి రమ్మని ఇటీవల ఒత్తిడి చేశాడు భర్త. ఇంటికి రాకపోతే ప్రైవేట్ వీడియోను వైరల్ చేస్తానని నిందితుడితో పాటు అతడి స్నేహితులు బాధితురాలిని బెదిరించారు. ఈ మేరకు బెంగళూరులోని సుబ్రమణ్యపుర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది.
అంతకుముందు, గత ఏడాది నవంబర్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వాలని పోలీసులు మూడు-నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా.. ఆమె సమాచారం ఇవ్వలేదు. తాజాగా పూర్తి సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం ఉదయం మహిళ భర్త, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.