దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సైబర్ సిటీగా పేరొందిన హరియాణాలోని గురుగ్రామ్‌లో కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్కడ మృతదేహాలను దహనం చేసేందుకు కనీస స్థలం దొరకని దుస్థితి నెలకొంది. నగరంలోని శ్మశానవాటికలన్నీ నిండిపోవడం వల్ల మృతదేహాలను.. కార్లు పార్కింగ్ చేసే స్థలంలో దహనం చేయాల్సి వస్తోంది.
గురుగ్రామ్‌లో ఉన్న దాదాపు అన్ని దహన వాటికలు పరిమితికి మించి పనిచేస్తున్నాయి. లెక్కకు మించి వస్తున్న మృతదేహాలతో.. స్థలం సరిపోవడం లేదని, శ్మశానవాటిక పార్కింగ్ స్థలంలో దహనం చేయడం మినహా మరో మార్గం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
అంబులెన్లుల బారులు
కరోనాతో మరణించిన వారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలనుకునే వారు తమ వంతు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో శవాలతో కూడిన అంబులెన్సులు శ్మశానాల ముందు బారులు తీరుతున్నాయని అక్కడ పనిచేసే వారు చెబుతున్నారు.
మరోవైపు, గురుగ్రామ్‌లో కరోనాతో 11మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. తాము ఇప్పటివరకూ 52 మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించినట్లు శ్మశానవాటిక వర్గాలు వెల్లడించాయి.
కరోనాను అరికట్టేందుకు నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పటికీ రోగుల సంఖ్య అధికంగా ఉంటోందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా సోకిందని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య