ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాతో ఏడాదికిపైగా ముందుండి పోరాడుతున్నారు వైద్యులు, పారిశుద్ధ్య, పోలీసులు సహా ఇతర సిబ్బంది. బయటకు వెళ్లాలంటేనే గజగజ వణికే సమయంలో ప్రజలకు వైద్యం, ఆహారం, భద్రత అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అంతటి అసమాన సేవలు అందిస్తున్నవారిని ఓ యువకుడు అభినందించాలనుకున్నాడు. కరోనా యోధులపై యువతకు అవగాహన కల్పించడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టాడు. అతడే కర్ణాటకకు చెందిన భరత్ పీఎన్.
ఎగసిన జెండా..
డిసెంబర్ 11న కన్యాకుమారిలో తన పాదయాత్ర మొదలుపెట్టాడు భరత్. ఇటీవలే కశ్మీర్ చేరుకున్నాడు. తనతో పాటు తీసుకెళ్లిన కరునాడ జెండాను కర్ణాటక జవాన్లతో కలిసి ఎగరవేశాడు.
ప్రకృతిపై ప్రేమ..
భరత్‌ది చమరాజనగర జిల్లాలోని కొల్లేగల. టీవీ డీటీహెచ్‌ల సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. వాక్ ఫర్ యూనిటీ పేరుతో విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు. అతడూ రోజకు 45-50కి.మీల పాటు నడిచేవాడు.
అంతులేని ఆత్మవిశ్వాసం..
భరత్.. ఆస్తమా బాధితుడు. అయితే ఆత్మవిశ్వాసం, తెగువకు అతడు చిరునామా. శ్వాస సమస్య ఉన్నప్పటికీ అతడు 4 వేల కి.మీలు నడిచాడు. సైక్లింగ్ కూడా చేస్తాడు. పర్వతారోహణలో దిట్ట.
పోలీసుల సత్కారం..
ఈ యాత్రలో ప్రభుత్వం నుంచి భరత్‌కు ఎలాంటి ఆర్థిక సహకారం, గుర్తింపు లభించలేదు. తన స్నేహితులు సహాయం చేసేవారని అతను చెబుతున్నాడు. పాదయాత్రలో పండ్లు, ఆహారం తప్ప డబ్బు రూపేణా చేయూత అందేది కాదు. ఈ ప్రయాణంలో అతడు 150 మొక్కలు నాటాడు. కశ్మీర్ పోలీసులు భరత్‌ను సత్కరించడం విశేషం.
ఇదీ చూడండి: రేప్ కల్చర్‌ను అంతమొందించండిలా..