ముఖంపై భారీ కణతి (Tumor on Face)... ఓ కన్ను పూర్తిగా మూసుకుపోవడం, నోరు తెరిచేందుకూ ఇబ్బందులు... ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే నామోషీ... ఇవీ ఒడిశాకు చెందిన మన్బోధ్ బాగ్ 17 ఏళ్ల పాటు ఎదుర్కొన్న సమస్యలు. వీటన్నింటి నుంచి వైద్యులు విముక్తి కల్పించారు. 16 శస్త్రచికిత్సలు (Tumor Surgery) నిర్వహించి ఎనిమిది కేజీల కణతిని విజయవంతంగా తొలగించారు.
టిట్లాగఢ్‌కు చెందిన మన్బోధ్ బాగ్ (Manbodh Bag) ... ప్లెక్సిఫార్మ్ న్యూరోఫిబ్రోమా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. 14 ఏళ్ల వయసు నుంచి ఆయన ముఖంపై కణతి (Tumor on Face) పెరగడం ప్రారంభించింది. ఇది క్రమంగా ఎనిమిది కేజీలు అయింది. సర్జరీ చేస్తే బతికే అవకాశం తక్కువగా ఉందని కొందరు వైద్యులు హెచ్చరించారు. దీంతో చాలా కాలం వరకు శస్త్రచికిత్స చేయించుకోలేదు. చివరకు కణతి నుంచి నియంత్రించలేని విధంగా రక్తస్రావం మొదలైంది. దీంతో చికిత్స తప్పనిసరైంది.
డబ్బులు ఇలా..
బెంగళూరుకు చెందిన ఓ మీడియా సంస్థ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆయన చికిత్సకు అవసరమైన డబ్బు సేకరించింది. ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆరు నెలల పాటు శస్త్రచికిత్స కొనసాగింది. మొత్తం 16 ఆపరేషన్లు జరిగాయి. బెంగళూరుకు చెందిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ, అంకాలజీ, ఆఫ్తమాలజీ, న్యూరో అనస్తీషియా విభాగాలకు చెందిన వైద్యులు సమన్వయంతో పనిచేసి శస్త్రచికిత్సను (Tumor Surgery) విజయవంతం చేశారు.
"కణతిని (Tumor on Face) తొలగించుకోవాలన్న ఆశతో చాలా ఆస్పత్రులకు వెళ్లాను. ఎంతో మంది వైద్యులను కలిశాను. కానీ ఏదీ విజయవంతం కాలేదు. చాలా సార్లు బయటకు వెళ్లేందుకే సిగ్గుగా అనిపించేది. నా జీవితం దయనీయంగా మారిపోయింది. కానీ ఇక్కడి వైద్యులు నా కణతిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. న్యూస్లయన్స్ మీడియా నెట్వర్క్, మిలాప్ క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ నాకు అండగా నిలబడ్డాయి. ఇప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు. నాకు చికిత్స అందించి, జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభించేందుకు కృషి చేసిన వైద్యులందరికీ కృతజ్ఞతలు."
-మన్బోధ్, బాధితుడు
క్లిష్టమైన శస్త్రచికిత్స..
ఈ సర్జరీ అనేక రిస్కులు కూడుకొని ఉన్నట్లు న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవి గోపాల్ వర్మ చెప్పారు. 'తల నుంచి మెడవరకు కణతితో మన్బోధ్ మా దగ్గరకు వచ్చారు. అతని కుడి కంటిని కణతి మింగేసింది. అతని ముఖంపై ఉన్న ఎముకలు కూడా దెబ్బతిన్నాయని సీటీ స్కాన్ చేస్తే తెలిసింది. ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు చికిత్స అందించేందుకు వివిధ పద్ధతులను బహుళ స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. మా బృందం జాగ్రత్తగా కేసును పరిశీలించి, చికిత్సకు ఉపక్రమించింది. ట్యూమర్‌ను తొలగించి, ముఖం ఎముకను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చాం' అని గోపాల్ వర్మ వివరించారు.
కృత్రిమ చర్మాన్ని పెంచి...
కణతిని తొలగించిన తర్వాత ముఖాన్ని సాధారణ స్థితి తీసుకురావడంపై తీవ్రంగా కృషి చేసినట్లు ఆస్పత్రి వైద్యుడు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు జీ మధుసూదన్ తెలిపారు. 'కణతి ముఖంలోని ఓ భాగం మొత్తం వ్యాపించినందున చాలా వరకు చర్మాన్ని తొలగించాల్సి వచ్చింది. మైక్రోసర్జికల్ టిష్యూ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహించాం. తొడ, కుడి మోచేతిపై పెంచిన కృత్రిమ చర్మాన్ని ముఖంపై అమర్చేందుకు ఉపయోగించాం' అని పేర్కొన్నారు.
లీటర్ల కొద్దీ రక్తం..!
శస్త్రచికిత్స కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని న్యూరోఅనస్తీషియా నిపుణుడు డా. రాఘవేంద్ర తెలిపారు. కణతి విచ్ఛేదనం ప్రారంభించిన తొలి రోజు 19 గంటల పాటు చికిత్స జరిగిందని గుర్తు చేసుకున్నారు. చాలా రక్తం పోయిందని చెప్పారు.
"40 లీటర్ల ద్రవాలను బాధితుడికి మార్పిడి చేశాం. 12 యునిట్ల రక్తాన్ని రిజర్వులో ఉంచుకున్నాం. సాధారణ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా ఇది చాలా ఎక్కువ. ఆ తర్వాత అదనంగా 8 యునిట్ల రక్తాన్ని స్వల్ప సమయంలోనే సేకరించగలిగాం. కణతి కారణంగా బాధితుడి నోరు తెరుచుకునేది కాదు. మూడు రోజులు ప్రయత్నించి బ్రీతింగ్ ట్యూబ్‌ను అమర్చగలిగాం. తర్వాత ఇంకో సర్జరీ చేశాం. ఇది 23 గంటలు కొనసాగింది. ఐసీయూలో న్యూరో సర్జన్లు రోగిని పర్యవేక్షించారు. 18వ రోజు ఐసీయూ నుంచి వేరే వార్డుకు తరలించాం. మా దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు మన్బోధ్ బరువు 58 కిలోలు ఉంటే.. సాధారణ వార్డుకు తరలించిన నాటికి 44 కేజీలకు తగ్గిపోయాడు."
-డా. రాఘవేంద్ర, న్యూరోఅనస్తీషియా నిపుణుడు
నిపుణులైన వైద్యుల బృందం అంతా ఒకే గొడుగు కింద ఉండటం వల్ల ఇలాంటి సంక్లిష్టమైన సర్జరీ కూడా విజయవంతంగా పూర్తైందని రాఘవేంద్ర పేర్కొన్నారు. మన్బోధ్ కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. అతనికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్ చాలీసా పారాయణం