తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోదీనే అని డీఎంకే నేత ఒకరు ఆరోపించారు. ప్రొఫెసర్ అన్బళగన్ శతజయంతి వేడుకల సందర్భంగా.. విలాతికుళం డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మార్కండేయన్.. మోదీనే జయలలితను హత్య చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే, డీఎంకే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఓ భాజపా నేత అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలని ఖండించారు.
జయలలిత 2016 సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. దాదాపు 10 వారాల పాటు చికిత్స పొంది.. 2016 డిసెంబర్ 5న మరణించారు. అప్పట్లో జయలలిత మరణంపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవాలను వెలికితీసేందుకు ఓ కమిటీని వేయాలని అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ దాదాపుగా ఐదేళ్లలో.. చాలా సార్లు తమ విచారణ కాలాన్ని పొడిగించిందని డీఎంకే ఎమ్మెల్యే అన్నారు. దీని వెనుక భాజపా హస్తం ఉందని ఆయన ఆరోపించారు.