Diwali Not Celebrating Villages : హిందూమతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు ఇంటినంతా దీపాల కాంతులతో నింపుతారు. అందుకే ఈ పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. ఆరోజు లక్ష్మీదేవిని, గణపతిలను పూజిస్తారు. టపాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారు వరకు ఎంతో ఇష్టంగా ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది దీపావళి పండుగను జరుపుకోకుండా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కర్ణాటక, తమిళనాడులోని పలు గ్రామాల ప్రజలు.. కొన్నేళ్లుగా ఈ పండుగను జరుపుకోవడం లేదు.
Diwali Not Celebrated In Karnataka.. కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు గత 200 సంవత్సరాలుగా దీపావళి పండుగకు దూరంగా ఉంటున్నారు. గతంలో జరిగిన ఘటనల కారణంగా గ్రామ పెద్దలు ఈ పండుగను చీకటి దినంగా భావిస్తున్నారు. గ్రామంలో వారే కాదు.. అక్కడ నుంచి విదేశాలకు వెళ్లి ఉంటున్న వారు కూడా ఈ పండుగను జరుపుకోరు. దీపావళి రోజు చేయాల్సిన పూజను కొంతమంది విజయదశమి నాడు.. మరికొందరు మహాలయ అమావాస్య రోజున చేసుకుంటున్నారు. అంతే కాకుండా దీపావళి రోజున పండుగ చేసుకుంటే చెడు జరుగుతుందని ఆయా గ్రామస్థులు నమ్ముతారు.
కారణమేమిటంటే.. రెండు శతాబ్దాల క్రితం లోకికెరె గ్రామానికి చెందిన కొందరు దీపావళి రోజున పెద్దల పండుగను జరుపుకోవడానికి కుశగడ్డి, పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. గడ్డి తీసుకురావడానికి వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు. గ్రామస్థులు వెళ్లి వెతికినా వారి ఆచూకీ లభించలేదు. ఆ కారణంగా గ్రామంలో దీపావళి జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి పండుగను చేసుకోవటం మానేశారు.
Diwali Not Celebrated in Tamilnadu.. తమిళనాడు శివగంగై జిల్లాలోని 12 ప్రాంతాల ప్రజలు.. గత ఆరు దశాబ్దాలుగా దీపావళి పండుగ జరుపుకోవడం లేదు. వ్యవసాయ పనులు లేని సమయంలో పండుగను జరుపుకోవాలంటే ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందని 1958లో ఆ గ్రామాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అప్పటి నుంచి 12 గ్రామాల ప్రజలు ఈ పండుగకు జరుపుకోవటం లేదని స్థానికులు తెలిపారు. గ్రామస్థులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు దూరంగా ఉంటారని చెప్పారు. 12 గ్రామాల ప్రజలు ఈ పండుగ రోజు చేయాల్సిన పూజలను సంక్రాంతి రోజున చేస్తారని వెల్లడించారు.
Diwali Precautions: ఈ దీపావళికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!