అంతా సవ్యంగా సాగుతున్న జీవితంలో కరోనా ఊహించన సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. కొవిడ్ సంక్షోభంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా యాత్రికుల సంఖ్య తగ్గి పర్యటక రంగం కళతప్పింది. పర్యటకులు రాక, ఆదాయం లేక.. రాజస్థాన్‌లోని జైపుర్ హాతిగావ్ సమీపంలో ఉండే ఏనుగుల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
గతేడాది కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పర్యటకం ఆశించినంత లేకపోవడం వల్ల ఏనుగుల పోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఏనుగు అంబారీలపై యాత్రికులు సవారీ చేస్తే వచ్చే ఆదాయంతో గజరాజులను పోషించే వారమని వారు చెబుతున్నారు. సరైన పోషకాహారం ఇచ్చేందుకు ఒక్కో ఏనుగుకు రోజుకు 3 వేల రూపాయలకు ఖర్చు అవుతోందని.. గిరాకీ లేక అది భారంగా మారిందని వాపోయారు. వీటికి తోడు దాణా ఖర్చులు సైతం పెరిగిపోవడం వల్ల మేత ఇచ్చేందుకు బంగారం సహా ఇతర ఆస్తులు అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో రెండో అతిపెద్ద ఏనుగుల శిబిరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. శివమొగ్గలోని గాజనూరు సమీపంలో ఉన్న సక్రెబైలు ఏనుగు శిబిరంలో 22 ఏనుగులు ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం సంవత్సరానికి దాదాపు 50 లక్షలు రూపాయలు ఖర్చు అవుతోంది. ఐతే.. రెండేళ్ల క్రితం వరకు పర్యటకుల ద్వారా ఏటా 80 నుంచి 90 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. దాని ద్వారా ఏనుగుల నిర్వహణ చేపట్టేవారు. కరోనా కారణంగా పర్యటకులు తగ్గి గతేడాది కేవలం 28 లక్షల రూపాయల ఆదాయమే వచ్చింది. ఫలితంగా ఏనుగుల పోషణ కష్టమైందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఏనుగులను దత్తత తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు