కాంగ్రెస్ సీనియర్ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణతో ప్రభుత్వం భారత దేశ హక్కుల్ని చైనాకు అప్పజెప్పినట్లైందని విమర్శించారు. బలగాల ఉపసంహరణ ఒప్పందం వల్ల భారత దేశ అధీనంలో ఉన్న భూభాగాల్ని చైనాకు వదులుకోవాల్సి వస్తుందని అన్నారు. చైనాతో యుద్ధం జరిగిన 1962 సమయంలోనూ భారత్ అధీనంలో ఉన్న గల్వాన్ లోయ విషయంలో గొడవ జరగలేదని తెలిపారు.
వార్షిక బడ్జెట్లో రక్షణశాఖకు కేటాయింపులపైనా విమర్శలు గుప్పించారు ఆంటోని. ఒక వైపు పాకిస్థాన్‌తో ఉగ్రవాద సమస్య మరో వైపు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణశాఖకు కేటాయింపులు మరింత పెంచాల్సింది పోయి గతేడాదితో పోల్చితే తక్కువ పెంచడం.. దేశానికి ద్రోహం చేయడమేనని కేంద్రంపై ధ్వజమెత్తారు. అంతేకాకుండా దీనివల్ల చైనా ముందు భారత దేశం నిలువలేదనే సందేశ మిచ్చినట్లవుతుందని అన్నారు. దేశ భద్రతకు నరేంద్ర మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇవ్వట్లేదని విమర్శించారు.
ఇదీ చూడండి: 'రక్షణ రంగంలో స్వావలంబనే కీలకం'