సాగు చట్టాల రద్దుపై కేంద్రం, రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రానికి రైతు సంఘాలు మరోమారు తేల్చి చెప్పాయి. దీంతో జనవరి 8న మరోసారి సమావేశం కావాలని రైతు సంఘాలు, కేంద్రం నిర్ణయించాయి.
అయితే చర్చల్లో తొలిసారి పురోగతి కనిపించిందని రైతు సంఘాల నాయకులు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్లు అయిన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదా? అని కేంద్ర మంత్రులు పదే పదే అడిగారని, అందుకు రైతు సంఘాల ప్రతినిధులందరూ ముక్తకంఠంతో లేదని తేల్చిచెప్పామని వెల్లడించారు. 460 రైతు సంఘాలన్నీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని కోరుకుంటున్నట్లు చెప్పామని పేర్కొన్నారు. దీనిపై కేంద్రంలో చర్చించి తదుపరి చర్చలకు వస్తామని మంత్రులు అన్నారని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నేత కవిత కురుగంటి వెల్లడించారు. సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మంగళవారం భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
పట్టు వీడటం లేదు..
సాగు చట్టాల రద్దుపై రైతు సంఘాల నేతలు పట్టువీడక పోవడం వల్లే చర్చలు అసంపూర్ణంగా ముగిశాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చట్టాల్లో ఉన్న సమస్యలేంటో అంశాల వారీగా చర్చిద్దామని రైతులను కోరితే, వారు మాత్రం రద్దు గురించి తప్ప మరో అంశంపై మాట్లాడటం లేదని చెప్పారు. ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం లేదనడాన్ని ఆయన తోసిపుచ్చారు. నమ్మకం లేకపోతే 8వ విడత చర్చలకు రైతులు ఎందుకు అంగీకరిస్తారని ప్రశ్నించారు. రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరిగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. జనవరి 8న జరిగే చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు తోమర్.
సాగు చట్టాల రద్దు తప్ప మరే ఇతర విషయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని రైతు సంఘం నాయకుడు బల్వీర్ సంగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర, చట్టాల ఉపసంహరణపై మాత్రమే తాము చర్చిస్తామని తేల్చి చెప్పారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడానికి ప్రభుత్వ అహమే కారణమని ఆయన అన్నారు.
కలిసి తినలేదు..
చర్చల విరామ సమయంలో ఎప్పటిలాగే స్వయంగా వండి తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు రైతు సంఘాలు ప్రతినిధులు. అయితే డిసెంబర్ 30న జరిగిన చర్చల్లో రైతులు తెచ్చిన ఆహారాన్ని వారితో కలిసి తిన్న కేంద్ర మంత్రులు ఈసారి అలా చేయలేదు. మంత్రుల బృందమంతా వేరో చోట కూర్చొని భోజనం చేశారు.