భారతీయ సమాజంలో (Azadi Ka Amrit Mahotsav) వివక్ష గురించి మాట్లాడే ఆంగ్లేయులు అడుగడుగునా తాము మాత్రం ఆ వివక్షనే పాటించారు. అనేక ప్రదేశాల్లో కుక్కలు, భారతీయులకు ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టి మరీ తమ ఆధిపత్యాన్ని, అనాగరికతను చాటుకున్నారు. చివరకు తమ గవర్నరే ఆశ్చర్యపోయేలా వివక్షను ప్రదర్శించారు.
1913లో ముంబయి గవర్నర్‌గా వచ్చారు లార్డ్ వెల్లింగ్డన్. లండన్ నుంచి ముంబయికి వచ్చే క్రమంలో... ఓడలో ఆయనకు పాటియాలా మహారాజు భూపీందర్‌సింగ్‌తో పరిచయమైంది. భూపీందర్‌సింగ్ మంచి సంపన్నుడు. ఆ కాలంలోనే ఆయన వద్ద 20 రోల్స్‌రాయిస్ కార్లుండేవి. వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్న ఏకైక భారతీయుడిగా పేరొందారు. బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. బ్రిటన్ రాణి అవార్డులు కూడా అందుకున్నారు. ప్రపంచయుద్ధ సమయంలో యుద్ధ మండలిలో భారత ప్రతినిధిగా కూడా ఆయన్ను నియమించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ల్లోనూ సిక్కు ప్రతినిధిగా హాజరయ్యారు. లార్డ్ వెల్లింగ్డన్‌తో భూపీందర్‌సింగ్‌కు మంచి స్నేహం కుదిరింది.
ఓ రోజు మహారాజును రాయల్ ముంబయి యాచ్‌క్లబ్‌లో విందుకు ఆహ్వానించారు వెల్లింగ్డన్. గేట్‌వే ఆఫ్ ఇండియాకు అభిముఖంగా ఉంటుందిది. ఆ క్లబ్‌కు గవర్నర్ హోదాలో వెల్లింగ్డన్ ప్యాట్రన్ కూడా! ఇద్దరూ తమ హోదాలకు తగ్గట్లు దుస్తులు ధరించి క్లబ్‌కు వెళ్ళారు. ప్రవేశద్వారం వద్ద నిలబడ్డ భటుడు ఇద్దరినీ కాసేపు ఆగమన్నాడు. గవర్నర్‌ను పక్కకు తీసుకొని వెళ్లి ఆయన చెవిలో 'సర్, భారతీయులకు క్లబ్‌లోకి ప్రవేశం లేదు' అంటూ చెప్పాడు. నిర్ఘాంతపోయిన లార్డ్ వెల్లింగ్డన్... 'నేనెవరో నీకు తెలుసా?' అంటూ గద్దించారు. 'తెలుసు సర్. కానీ క్లబ్ రూల్స్ అంతే' అంటూ పునరుద్ఘాటించాడు. వెంటనే కోపంతో ఊగిపోయిన గవర్నర్ క్లబ్ కార్యదర్శిని పిలిపించారు. 'ముంబయి గవర్నర్‌ను నేను. పాటియాలా మహారాజును నా అతిథిగా ఆహ్వానించాను. ఇద్దరం కలసి ఇక్కడ విందు ఆరగిస్తాం' అంటూ స్పష్టం చేశారు. కానీ క్లబ్ సెక్రటరీ 'సర్... నేనేమీ చేయలేను. భారతీయులను తీసుకొని రావటానికి నిబంధనలు అంగీకరించవు' అంటూ చెప్పటంతో ఆగ్రహంతో, అవమానభారంతో ఇద్దరూ వెనక్కి తిరిగారు.
కొద్దిరోజుల్లోనే లార్డ్‌వెల్లింగ్డన్... హాజిఅలీదర్గాకు దగ్గర్లో భారీ స్థలం సేకరించి... తన పేరిట పేద్ద క్లబ్‌హౌస్ నిర్మించారు. బ్రిటిష్‌వారితో పాటు భారతీయులకు అందులో సభ్యత్వం కల్పించారు. బ్రిటిష్ హయాంలో భారతీయులకు చోటిచ్చిన తొలి క్లబ్ అదే. యాచింగ్‌క్లబ్‌లో అవమానభారానికి విరుగుడుగా పాటియాలా మహారాజు కూడా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ఆరంభించాడు.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: బ్రిటిషర్లకు లొంగని బానిస రాణి.. హజ్రత్ మహల్!