దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. టీకాల కొరత వేధిస్తోంది. చాలా రాష్ట్రాలు తమ వద్ద టీకా నిల్వలు పూర్తయ్యాయని చెబుతున్నాయి. మరిన్ని టీకా డోసులను పంపేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
ముంబయిలో వ్యాక్సినేషన్‌కు బ్రేక్
సరిపడా టీకాలు లేక ముంబయిలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. బీకేసీలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కేంద్రం సహా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముంబయిలో ఉన్న 120 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 75 కేంద్రాలను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి తలెత్తింది. కరోనా టీకాల కొరత ఉందని ఇప్పటికే కేంద్రంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ముంబయిలో టీకా పంపిణీకి కొత్తగా 1.80 లక్షల డోసులను కేంద్రం శుక్రవారం అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
30 లక్షల డోసులు పంపండి: రాజస్థాన్ సీఎం
వచ్చే రెండు రోజులకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. తక్షణం 30 లక్షల డోసుల టీకాలను పంపేలా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.
ఇందోర్‌లో ప్రజల నిరసన
టీకా అందలేదని ఆగ్రహిస్తూ మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. టీకా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి వరుసలో నిల్చున్నా.. చివరికి తమ వంతు వచ్చేసరికి టీకా అందుబాటులో లేదంటూ సిబ్బంది బోర్డు పెట్టారని ప్రజలు పేర్కొన్నారు.
పంపుతుందని ఆశిస్తున్నాం: ఒడిశా
తమ రాష్ట్రంలో 3.2 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు, లక్ష కొవాగ్జిన్ టీకా డోసులు మాత్రమే ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఈ టీకా నిల్వలతో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పింది. రానున్న రెండు రోజుల్లో మరిన్ని టీకా డోసులను కేంద్రం సరఫరా చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
'టీకాలు వస్తేనే నిరంతరాయంగా వ్యాక్సినేషన్'
కేంద్రం నుంచి ఇప్పటివరకు 35.83 లక్షల టీకా డోసులను తాము అందుకున్నామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘSల్ తెలిపారు. ప్రస్తుతం 4.83 లక్షల టీకా డోసులు మాత్రమే ఉన్నాయని.. ఇవి రెండు రోజుల పాటు మాత్రమే సరిపోతాయని చెప్పారు. తాము మరో ఏడు రోజుల కోసం వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామని చెప్పారు. తద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించగలుగుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'మోదీజీ... టీకా ఎగుమతులు నిషేధించండి'