మమతా బెనర్జీని గద్దె దించాలని బంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నందిగ్రామ్ ప్రజలు ఆ కలను ఈ రోజు నెరవేర్చుకున్నారని చెప్పారు. బంగాల్లోని ఉలుబేడియాలో నిర్వహించిన భాజపా ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన.. బంగాల్ పునరుజ్జీవం కోసం రాష్ట్ర ప్రజలు బాటలు పరుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దీదీపై విమర్శలు ఎక్కుపెట్టారు మోదీ. మమత తనను బయటి వ్యక్తిగా అభివర్ణిస్తూ.. చొరబాటుదారులను సొంతవారిగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశ పౌరులపై బయటివారు అనే ముద్ర వేసి రాజ్యాంగాన్ని అవమానించొద్దని హితవు పలికారు.
"కొన్నిసార్లు దీదీ నన్ను యాత్రికుడు అంటారు. మరికొన్నిసార్లు బయటి వ్యక్తి అంటారు. చొరబాటుదారులను మీరు సొంతవారిగా పరిగణించి.. భరత మాత పుత్రులను బయటి వ్యక్తులు అని అంటున్నారు. ప్రజల్ని అవమానించడం ఆపండి. ప్రజలపై బయటి వ్యక్తులనే ముద్రవేసి రాజ్యాంగాన్ని కించపరచకండి. బంగాల్ ప్రజలు తమ గుర్తింపును, భవిష్యత్‌ను కాపాడుకునేందుకు ఇంకొంత కాలం ఎదురుచూడాలని అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో మాత్రమే పాల్గొనడం లేదు.. బంగాల్ పునరుజ్జీవానికి బాటలు పరుస్తున్నారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన దీదీ.. ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించారు మోదీ. మరో స్థానానికి నామినేషన్ వేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత అని అడిగారు. నందిగ్రామ్ ప్రజలు మమతకు తమ సమాధానం ఇచ్చారని.. ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఇవీ చదవండి: