Dhiraj Takri English Classes In Social Media : చదివింది పదో తరగతి. అయితేనేం అనుకున్నది సాధించాలనుకున్నాడు ఓ యువకుడు. పట్టుదలతో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న భాషను ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా సైట్స్‌లో పాఠాలుగా చెబుతున్నాడు. ఇప్పుడు అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లోనే 9లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నైకీ షూ, ఇంగ్లిష్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాం ఇన్క్నా, అమెరికన్ ఇడియమ్ బుక్ వంటి కంపెనీలను ప్రమోట్ చేస్తున్నాడు. అతడే ఒడిశాలోని నబరంగ్పుర్కు చెందిన ధీరజ్ టక్రీ.
నబరంగ్పుర్ జిల్లాలోని చిట్టకోట్ గ్రామానికి 21 ఏళ్ల ధీరజ్ చదివింది పదో తరగతే అయినా ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కుతుహలంతో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఇంటర్ ఫెయిల్ అయిన ధీరజ్ ఇంగ్లిష్ నేర్చుకుంటే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మేవాడు. అందుకే చదువు ఆపేసి ఇంగ్లిష్ నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టాడు. 2019 నుంచి ధీరజ్ అనేక ఆంగ్ల పుస్తకాలను చదివాడు. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఇంగ్లిష్ క్లాసులు విన్నాడు. ఈ క్రమంలో ధీరజ్‌కు 2020లో అమెరికన్ ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఆశ కలిగింది. అలా అమెరికన్ ఇంగ్లిష్‌ను కూడా కష్టపడి నేర్చుకున్నాడు ధీరజ్.
ఈ తర్వాత అమెరికన్ ఇంగ్లిష్‌ను ఎలా నేర్చుకోవాలి అనే పాఠాలను రికార్డ్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో అప్లోడ్ చేశాడు. తొలుత అతడికి ఆశించిన స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రాలేదు. 2023 సెప్టెంబర్ 7 నాటికి అతడికి ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య కేవలం 165మంది మాత్రమే. కానీ ధీరజ్ ఇంగ్లీష్ టీచింగ్ నచ్చడం వల్ల ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. కొద్ది రోజుల్లోనే ధీరజ్‌కు ఇన్‌స్టా ఫాలోవర్స్ 9లక్షల దాటిపోయారు. ఇప్పటివరకు ధీరజ్ ఇన్‌స్టాలో 94వీడియోలను పోస్ట్ చేశాడు. ధీరజ్‌కు భారత్‌లోనే కాకుండా అమెరికాలో 18వేలు, కెనడాలో 9వేలు, యూకే 8వేల మంచి ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ధీరజ్ సోషల్ మీడియాలో ఇంగ్లిష్ ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాడు.
ధీరజ్‌ది మధ్య తరగతి కుటుంబం. అతడి తండ్రి సైకిల్ రిపేరు షాపు నడుపుతుంటాడు. పేదరికంలో ఉన్నా ధీరజ్‌కు అతడి కుటుంబం అన్నివేళలా అండగా నిలిచింది. ధీరజ్ సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో ఫేమస్ కావడం వల్ల అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధీరజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి అగ్రశ్రేణి కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలని కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికన్ ఇంగ్లిష్, ఆంగ్ల భాషను బోధించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ధీరజ్.