దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఝార్ఖండ్, ధన్‌బాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది జిల్లా పోలీసు యంత్రాంగం. ఈ నేపథ్యంలో పలు కేసులతో సంబంధాలున్న 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 243 మంది నేరగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఓ అధికారి తెలిపారు.
జడ్జిని ఆటో ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీని బయటకు వదిలినందుకు సబ్-ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
గత నెల 28 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అతడి అనుచరుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన దృశ్యాలను చూస్తే ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు యత్నించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
న్యాయ వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై.. ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
ఇదీ చూడండి: జడ్జి హత్యపై దుమారం- అసలు కారణాలేంటి?