దేశ ప్రజలు దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయోధ్య మొదలుకుని దేశం నలుమూలలా అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
గోవా రాజధాని పనాజీలో ఉదయమే నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. నరకాసురుడి బొమ్మ దహనం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని 800 కిలోల పూలతో అలంకరించారు. మంచు కొండల నడుమ నిండా పూలతో ముస్తాబు అయిన ఈ ఆలయం చూడముచ్చటగా కనిపిస్తోంది.
బద్రీనాథ్ ఆలయాన్ని కూడా పూలతో ముస్తాబు చేశారు.
బంగాల్లోని దక్షిణేశ్వర్‌లో కాళీమాత ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ్ లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు.
కేరళలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
తమిళనాడులో మధుర, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
దీపావళి సందర్భంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లోని మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఆలయాలు, నగరాలకు 'దీపావళి' వెలుగులు