తమిళనాడు.. తిరునల్వేలిలోని నేలాయప్పర్ గాంధీమతి అమ్మన్ ఆలయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. దేవస్థానం ఏనుగుకు రూ.12వేలు విలువ చేసే తోలు చెప్పులను భక్తులు కానుకగా ఇచ్చారు. తిరునల్వేలిలో ఉన్న ఈ దేవాలయం 2000 ఏళ్ల నాటిది. ఈ ఆలయ ఏనుగు పేరు గాంధీమతి. ఈ గజరాజును 13 ఏళ్ల వయసులో ఆలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం 52 ఏళ్లు. గత 39 ఏళ్లుగా నేలాయప్పర్ దేవాలయంలో సేవలు చేస్తోంది ఈ గజరాజు.
2017లో గాంధీమతి అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య పరీక్షలు చేయించగా.. అధిక బరువుతో బాధ పడుతోందని వైద్యులు చెప్పారు. 300 కేజీలు బరువు అదనంగా ఉందని తెలిపారు. గజరాజు బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఆలయ నిర్వాహకులు అప్పటి నుంచి ఏనుగును ప్రతిరోజూ దాదాపు 5 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. దీంతో కేవలం ఆరు నెలల్లోనే 150 కేజీల బరువు తగ్గింది ఏనుగు. అయితే అప్పటి నుంచి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడుతోంది. ఈ స్థితిలో నేలాయప్పర్ ఆలయ భక్తులు ఏనుగుకు రూ.12 వేల విలువైన పాదరక్షలను విరాళంగా అందించారు. తోలు చెప్పులు వేసుకొని నడిస్తే.. కాస్తైనా ఏనుగుకు ఉపశమనం ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేశారు.
ఇవీ చదవండి: వింత చోరీ.. ఇంట్లోకి అవసరమైన వాటినే ఎత్తుకెళ్లిన దొంగలు