Shirdi Sai Baba Mandir Donation : షిర్డీ సాయిబాబా ఆలయానికి పెద్దఎత్తున ఆదాయం వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు నెలన్నర వ్యవధిలో.. వివిధ రూపాల్లో రూ. 47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడ్ని దర్శనం చేసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు 2వేల నోట్లు చలామణిలో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నెలన్నర సమయంలో.. సాయి భక్తులు రూ. 2.4 కోట్ల విలువైన 2వేల నోట్లను సమర్పించారు. ఈ మేరకు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్ వివరాలు వెల్లడించారు.
సాయిబాబాకు వచ్చిన కానుకలు..
- విరాళాలు - రూ. 25.89 కోట్లు
- హుండీ ఆదాయం- రూ. 9.83 కోట్లు
- డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా - రూ. 5.15 కోట్లు
- ఆన్‌లైన్ విరాళం - రూ. 3. 34 కోట్లు
- చెక్కులు, డీడీల ద్వారా - రూ.1. 82 కోట్లు
- మనీయార్డర్ ద్వారా - రూ. 27. 37 లక్షలు
- రెండు కిలోల బంగారం - రూ. 1.17 కోట్లు
- 52 కిలోల వెండి - రూ. 28.49 లక్షలు
మూడు రోజుల్లో రూ.4 కోట్ల విరాళం..
ఇంతకుముందు ఏప్రిల్లో శ్రీరామ నవమి పండగ సందర్భంగా శిర్డీ సాయినాథ్ మందిరానికి మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల విరాళం వచ్చింది. ఆ సమయంలో సాయినాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పండగ సమయంలో రెండు లక్షల మంది భక్తులు శ్రీ షిర్డీ సాయిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాబాకు కానుకలు సమర్పించారు. శ్రీరామ నవమి సీజన్లో శ్రీ సాయి బాబా ఆలయం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. వివిధ మార్గాల్లో భక్తులు తమ కానుకలను సాయి బాబాకు సమర్పించుకున్నారని ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) రాహుల్ జాదవ్ వెల్లడించారు. హుండీ బాక్స్, హుండీ కౌంటర్, ఆన్‌లైన్ డొనేషన్లన్నింటినీ లెక్కించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు రాహుల్. హుండీ బాక్స్ నుంచి అత్యధికంగా డొనేషన్లు వచ్చాయని తెలిపారు.
రూ. 30 లక్షల విలువైన హారం..
సాయిబాబాను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీకి వెళ్తారు. వివిధ రకాలుగా కానుకలు సమర్పిస్తారు. అలా ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు రూ. 30 లక్షలు విలువైన నవరత్నాల హారాన్ని కానుకగా ఇచ్చాడు.