Driver Alert: రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో.. డ్రైవర్ నిద్రమత్తు వల్ల జరుగుతున్నవే అధికంగా ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలాంటి ఎన్నో ప్రమాదాలను చూసి మహారాష్ట్ర నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువకుడు చలించిపోయాడు. డ్రైవర్ అనుక్షణం అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను తగ్గించవచ్చని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనలకు పదును పెట్టి డ్రైవర్‌ను అలర్ట్ అనే సరికొత్త పరికరాన్ని రూపొందించాడు.
ఎలా పని చేస్తుందంటే?
వృత్తి రీత్యా టాక్సీ డ్రైవర్ అయిన గౌరవ్ సవ్వలఖే.. నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను తన కళ్లతో చూశానని అంటున్నాడు. తనకు కూడా కొన్ని సార్లు రాత్రి సమయంలో నిద్రమత్తు వచ్చినట్లు చెప్పాడు. అలాంటప్పుడు.. డ్రైవర్‌ను ఎవరైనా అప్రమత్తం చేస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని చెవికి పెట్టుకునే సైజులో అలారం డివైజ్‌ను తయారుచేసినట్లు గౌరవ్ తెలిపాడు. బ్లూటూత్ సైజులో ఉండే ఈ పరికరంలో.. 3.6 ఓల్ట్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చినట్లు చెప్పాడు. ఈ డివైజ్‌లో అమర్చిన సెన్సార్ ఆధారంగా ఇది డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుందని గౌరవ్ పేర్కొన్నాడు. వాహనం నడిపేటప్పుడు.. డ్రైవర్ తల భాగం స్టీరింగ్‌కు 30 డిగ్రీల కిందికి వంగితే... వెంటనే ఈ పరికరం నుంచి అలారం మోగుతుందని తెలిపాడు. డ్రైవర్ అప్రమత్తమై డివైజ్‌ను ఆఫ్ చేసే వరకూ ఇది శబ్దం చేస్తూనే ఉంటుందని చెప్పాడు. ఈ డివైజ్‌లో ఆన్, ఆఫ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.
ఈ పరికరం సాయంతో.. రోడ్డు ప్రమాదాలు కొంతమేరకైనా తగ్గుతాయని ఆశిస్తున్నట్లు గౌరవ్ తెలిపాడు. భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించే దిశగా.. మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెప్తున్నాడు.
ఇదీ చూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ