ఓబీసీల్లోని సంపన్న వర్గాలను కేవలం ఆర్థిక కొలమానాల ప్రకారం నిర్ధరించడం తప్పని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికం ప్రాతిపదికన హరియాణా ప్రభుత్వం(Haryana government) జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఓబీసీల్లో సంపన్న శ్రేణి నిర్ధరణకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలో ఇందిరాసాహ్ని-1(Indra Sawhney-I) జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉందని, దానిని అనుసరించాలని సూచించింది.
తదుపరి విచారణ లేకుండానే..
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసుల ద్వారా ఉన్నత పోస్టులు పొందిన వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగి ఉంటారన్న ధర్మాసనం... అలాంటివారిని తదుపరి విచారణ లేకుండానే సంపన్న శ్రేణిగా పరిగణించవచ్చని పేర్కొంది. తగినంత ఆదాయం ఉండి.. ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరిన వారిని కూడా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరిన వారిగానే భావించాలని సూచించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి ఉండి.. ఆస్తుల ద్వారా పరిమితికి మించి ఆదాయం పొందుతున్న వారు రిజర్వేషన్(Reservations) ప్రయోజనాలు పొందడానికి అర్హులు కాదని పేర్కొంది.
అందువల్ల.. పైన పేర్కొన్న వర్గాలను వెనుకబడిన తరగతుల నుంచి మినహాయించాలని.. గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్లు తీర్పులో స్ఫష్టం చేసింది. హరియాణా సర్కారు నోటిఫికేషన్ ఆధారంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టి ఉంటే.. వాటి జోలికి వెళ్లకూడదని పేర్కొంది.
దృష్టిలో ఉంచుకోవాలి..
వివిధ కేసుల్లోని నిందితులు బెయిల్ కోసం పెట్టుకొనే దరఖాస్తులను(bail applications) విచారించేటప్పుడు న్యాయస్థానాలు కొన్ని కొలమానాలను దృష్టిలో ఉంచుకోవాలని జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం మంగళవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. పంజాబ్-హరియాణా హైకోర్టు ఓ హత్య కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చిన తర్వాత బయటికొచ్చి మళ్లీ నేరాలకు పాల్పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది.
- నిందితుడు నేరం చేశాడని నమ్మడానికి ప్రాథమిక ఆధారాలు, సహేతుకమైన కారణాలున్నాయా?
- నేరారోపణ స్వభావం, దాని తీవ్రత..
- నేరం రుజువైతే పడే శిక్ష తీవ్రత ఎంతవరకు ఉంటుంది?
- నిందితుడు బెయిల్ మీద విడుదలైన తర్వాత తప్పించుకు పోతే తలెత్తే ప్రమాదమెంత?
- నిందితుడి గుణం, ప్రవర్తన, వారి గత చరిత్ర ఏంటి?
- అలాంటి నేరాలు మళ్లీ చేయడానికి ఉన్న అవకాశం ఎంత?
- సాక్షులను ప్రభావితం చేయడానికి ఉన్న అవకాశాలు..
- బెయిల్ మంజూరు చేస్తే న్యాయానికి తలెత్తే ప్రమాదం ఏంటి?.. అన్న అంశాలను కింది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: Narayan Rane News: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు
ఇదీ చూడండి: Attorney General: 'బాంబే హైకోర్టు తీర్పు హానికరం'