వయసు 58 ఏళ్లు, తోడుగా డయాబెటిస్, ఊపిరితిత్తులు క్యాన్సర్.. ఇప్పుడు అదనంగా కరోనా వైరస్. ఇన్ని ప్రతికూలతల నడుమ గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన జయాబెన్.. కరోనా మహమ్మారిని జయించారు. దృఢ నిశ్చయంతో, బలమైన సంకల్పంతో వైరస్‌ను తన ఒంట్లో నుంచి తరిమేశారు. ఇందుకు వైద్యులు ఎనలేని కృషి చేశారు.
![Despite breast cancer and diabetes, 58-year-old Jayaben defeated COVID-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11524091_335_11524091_1619267383884.png)
ఖంభాత్‌లో నివసిస్తున్న జయాబెన్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే డయాబెటిస్ వ్యాధి ఉండటం వల్ల.. జయాబెన్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోసాగాయి. దీంతో వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా 24 రోజులు కరోనాతో పోరాడారు జయాబెన్.
అయితే.. తన ఆరోగ్య పరిస్థితిపై జయాబెన్ ఎప్పటికప్పుడు ధీమాగానే ఉన్నారు. తాను కోలుకుంటానని చికిత్స జరుగుతున్నన్ని రోజులు వైద్యులతో చెప్పేవారు. చివరకు 24 రోజుల అనంతరం కరోనాను జయించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్లారు.
సానుకూలంగా ఉంటే చాలు!
తనను బాగా చూసుకున్న ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞత తెలిపారు జయాబెన్. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, సానుకూల ఆలోచనలు ఉంటే ఏ రోగమైనా నయమవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి- 'మశ్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా' ఎక్కడ ఉందంటే?