కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది
"విమానాశ్రయానికి చేరుకున్న క్యాబ్ డ్రైవర్ ప్రతాప్(26).. పికప్ పాయింట్‌కు కొద్ది దూరంలో కారు నిలిపాడు. అనంతరం పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకున్నాడు. కారు నుంచి దట్టమైన పొగ రావడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. దగ్గరకు వెళ్లారు. కారు అద్దాలు పగలగొట్టి.. బాధితుడిని సమీపంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 90శాతం కాలిపోయిన ప్రతాప్.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 5.30 గంటలకు మృతి చెందాడు.
"కరోనా లాక్డౌన్ వల్ల ప్రతాప్ ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. కనీసం కారు ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు" అని అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు గమనిక
ప్రతాప్ ఆత్మహత్యతో మిగిలిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ కారణంగా విమానాశ్రయానికి రావడానికి తమ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: దిల్లీ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం