భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అనుమతి నిరాకరించారు. తాజా ఇంటర్వ్యూలో గొగొయి.. న్యాయవ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ధిక్కరణ చర్యలకు అనుమతివ్వాలని.. సామాజిక ఉద్యమకారుడు సాకేత్ గోఖలే చేసిన విజ్ఞప్తిని వేణుగోపాల్ తోసిపుచ్చారు.
"మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ గొగొయి న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు గురించి కఠినమైన వ్యాఖ్యలు చేశారన్నది వాస్తవం. అయితే, ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని చూడాలి. న్యాయవ్యవస్థ మంచి కోసమే తప్ప కోర్టుపై బురదచల్లడం, ప్రజల ముందు దాని స్థాయిని తగ్గించడం ఆయన ఉద్దేశం కాదు. అందువల్ల కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు చేపట్టడానికి నిరాకరిస్తున్నాను" అని వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మద్దతు కోసం 5 రాష్ట్రాల్లో టికాయిత్ పర్యటన