కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఆర్బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్యనిర్వాహక విధానాన్ని తాము తప్పుబట్టలేమని తెలిపింది. నోట్లరద్దును 4-1తో రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.
"పెద్దనోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం లోపభూయిష్టంగా లేదు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేం. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నది సంబంధం లేదు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ 2016 నవంబరు 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుంది."
-- సుప్రీంకోర్టు
వ్యతిరేక తీర్పు ఇచ్చిన ఆ న్యాయమూర్తి ఎవరు?
ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బీవీ నాగరత్న.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. నోట్ల రద్దును చట్టం ద్వారా చేపట్టాల్సిందని.. నోటిఫికేషన్ ద్వారా కాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
"ఆర్‌బీఐ నుంచి అభిప్రాయం మాత్రమే తీసుకున్నారు. దీన్ని సిఫార్సుగా భావించలేం. గెజిట్ నెటిఫికేషన్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టాల్సింది కాదు. నోట్ల రద్దుపై పార్లమెంట్లో చట్టం చేయాల్సింది. దేశం మొత్తానికి ముఖ్యమైన ఇలాంటి నిర్ణయం విషయంలో పార్లమెంట్‌ను విస్మరించడం తగదు. నోట్ల రద్దు అనేది చట్టవిరుద్ధమైన నిర్ణయం."-జస్టిస్ బీవీ నాగరత్న, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ ఏమందంటే?
"నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం. లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీం కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది"
-- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
భాజపా స్పందనేంటి?
" 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణను అడ్డుకోవడమే కాకుండా వారి ఆర్థిక మూలాలకు అతి పెద్ద దెబ్బ అని నిరూపితమైంది. అలాగే, ఆదాయ పన్ను వ్యవస్థ బలోపేతమైంది. ఆర్థిక వ్యవస్థను పరిశుభ్రం చేసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఊపందుకున్న డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా?
--రవి శంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి
దేశంలో పెద్దనోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపింది?
దేశంలో చలామణిలో ఉన్న నగదుపై పెద్ద నోట్ల రద్దు ఎలాంటి స్పష్టమైన ప్రభావం చూపలేదని ఆర్‌బీఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం అప్పటి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అప్పటి నుంచి 2022 డిసెంబరు 23 నాటికి చలామణిలో ఉన్న నగదు విలువ 83 శాతం పెరిగింది.
నోట్ల రద్దు సమయానికి ప్రజల వద్ద చలామణిలో ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లు కాగా.. రద్దు ప్రభావంతో 2017 జనవరి 6 నాటికి అది గణనీయంగా తగ్గి రూ.9 లక్షల కోట్లకు చేరింది. తిరిగి 2022 డిసెంబరు 23 నాటికి ఆ విలువ రూ. 32.42 లక్షల కోట్లకు పెరిగింది. 2017 జనవరి 6 నాటితో పోలిస్తే 260 శాతం, 2016 నవంబరు 4తో పోలిస్తే చలామణిలో ఉన్న నగదు విలువ 83 శాతం పెరిగింది.
నకిలీ కరెన్సీ నోట్ల కట్టడి సంగతేంటి?
2016లో పెద్ద నోట్ల రద్దుకు ఒక కారణం.. నకిలీ కరెన్సీ నోట్ల చలామణీని తగ్గించడం. అయితే ఇప్పడు ఇదే ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.245.33 కోట్ల నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2020లో అత్యధికంగా రూ.92.17 కోట్ల విలువైన నకిలీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2016లో అత్యల్పంగా రూ.15.92 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు.