Demonetisation Supreme Court verdict reserved : 500, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ నిర్ణయానికి సంబంధించిన దస్త్రాలన్నింటినీ తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. శనివారంలోగా ఇరు పక్షాలు లిఖితపూర్వక సమాధానాలు దాఖలు చేయాలని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సూచించింది.
ఆర్థిక విధానాల అంశాల్లో న్యాయసమీక్ష అధికారం పరిమితంగా ఉందంటే.. దాని అర్థం న్యాయస్థానం చేతులు కట్టుకుని కూర్చుంటుందని కాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎప్పుడైనా పరిశీలించొచ్చని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దును అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించిన పిటిషినర్, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం.. ఆర్బీఐ సిఫార్సుల మేరకే నోట్ల రద్దు చేయాల్సి ఉంటుందని వాదించారు. కేంద్రం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది.. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపశమనం లభించదని పేర్కొన్నారు. తాత్కాలిక కష్టాలు ఉన్నాయని.. కానీ అవి దేశ నిర్మాణ ప్రక్రియలో అంతర్భాగమేనన్నారు.
2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ సాగించిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. నోట్ల రద్దు అనేది ఆలోచించి తీసుకున్న నిర్ణయమని.. నకిలీ నోట్లు, నల్లధన నిర్మూలనం, ఉగ్రవాదానికి నిధులు, పన్ను ఎగవేతలను ఎదుర్కొనేందుకు తీసుకున్న వ్యూహంలో భాగమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది.
ఇవీ చదవండి: 'నోట్ల రద్దు వల్ల చాలా ప్రయోజనాలు.. అందుకే పన్ను వసూళ్లు పెరిగాయి'
నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్లైన్!