Delimitation Panel of Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డీలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ పదవీకాలం పూర్తయ్యే ఒకరోజు ముందే సరిహద్దులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత.. ఆర్డర్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది కమిషన్.
జమ్ముకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని కమిషన్ ప్రతిపాధించింది. అందులో కశ్మీర్ డివిజన్లో 47, జమ్ము డివిజన్లో 43 ఉండగా.. వాటితో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు తొమ్మిది సీట్లు కేటాయించింది. జమ్ములో ఆరు స్థానాలు, కశ్మీర్లో ఒక స్థానాన్ని అదనంగా ప్రతిపాదించింది కమిషన్. ఇప్పటి వరకు కశ్మీర్ డివిజన్లో 46 సీట్లు, జమ్ము డివిజన్లో 37 సీట్లు ఉండేవి. 2011 జనాభా లెక్కలు, జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లోని వివిధ వర్గాల రాజకీయ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు డీలిమిటేషన్ కమిషన్ తెలిపింది. సీట్ల కేటాయింపులో రాకపోకలకు అనుకూలత, స్థలాకృతి, సరిహద్దుకు సామీప్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇంతవరకు జమ్ము పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న ఫూంచ్, రాజౌరీ జిల్లాలను అనంతనాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో విలీనం చేశారు.
ముసాయిదాపై దుమారం: కొన్నినెలల క్రితం విడుదలచేసిన జమ్ముకశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదాపత్రంపై తీవ్రదుమారం రేగింది. ఈ ప్రక్రియ మొత్తం భారతీయ జనతా పార్టీకి మేలు చేసేలా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. చాలాప్రాంతాల్లో మెజార్టీ ప్రజలు మైనార్టీలుగా మారినట్లు విమర్శించాయి. డీలిమిటేషన్ కమిషన్ సమర్పించిన తుది నివేదిక ప్రతిపాదనలను అక్కడి ప్రాంతీయ పార్టీలు తోసిపుచ్చాయి. భాజపాకు రాజకీయంగా ప్రయోజనం కలిగేలా నియోజకవర్గాల సరిహద్దులను మార్చినట్లు ఆరోపించాయి.
జమ్ముకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020, మార్చిలో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. 2021లో మరో ఏడాది పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర, జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఉన్నారు. అయితే, ఈ కమిటీ పదవీ కాలం మార్చి 6తో ముగియాల్సి ఉండగా.. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు 2022, మార్చిలో రెండు నెలలు పొడిగించారు.
ఇదీ చూడండి: 'జమ్ములో కొత్తగా ఆరు.. కశ్మీర్లో ఒకటి'.. నియోజకవర్గాల పునర్విభజనపై రగడ