ఎన్‌సీఈఆర్‌టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్) పుస్తకాలను అక్రమంగా ప్రింట్ చేస్తున్న మనోజ్ జైన్ అనే వ్యక్తిని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. దిల్లీలోని షాదారా ప్రాంతానికి చెందిన అతని వద్దనుంచి దాదాపు 5,000 పుస్తకాలు సహా.. 80,000 ప్రింటింగ్ కాపీలు, 166 మెటాలిక్ ప్లేట్లు, రెండు ఆఫ్‌సెట్ ప్రింటింగ్ మిషన్లు, ఎన్‌సీఈఆర్‌టీ లోగో(వాటర్‌మార్క్) ఉన్న పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీబీఎస్ఈ పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీనితో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పలు పాఠశాలలు.. ప్రైవేట్ పబ్లికేషన్ హౌస్‌ల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందిగా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. దీనిని అదునుగా భావించిన నిందితులు ఈ పుస్తకాలను పైరసీ చేయడం ప్రారంభించారు. దుకాణదారులు కూడా అధిక లాభాల కోసం ఈ పుస్తకాలను అమ్మడం ప్రారంభించారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పక్కా సమాచారం మేరకు..
ఈ క్రమంలోనే యమునా నగర్లో పుస్తకాల పైరసీ జరుగుతోందన్న సమాచారం మేరకు పక్కాగా ప్రణాళికతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వినోద్ అహ్లావత్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.35లక్షల విలువైన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
మొదట ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసిన నిందితుడు సొంత ప్రెస్ నడపడం మొదలుపెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారంలో వచ్చిన నష్టాలను తీర్చుకునేందుకు ఈ దందాకు తెరలేపాడని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున వీటిని ఎంచుకున్నట్లు నిందితుడు వెల్లడించాడని వివరించారు.
ఇవీ చదవండి: