Delhi omicron cases: దేశ రాజధానిలో కొవిడ్ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 73 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 238కి చేరింది. ఇందులో 57 మంది కోలుకున్నారు.
దిల్లీలో మంగళవారం కొత్తగా 496 కరోనా కేసులు వచ్చాయి. ఒకరు మృతి చెందారు. ఆరున్నర నెలల తర్వాత ఈస్థాయిలో కేసులు రావటం ఇదే తొలిసారి.
"మంగళవారం 496 కొత్త కేసులు వచ్చాయి. కొవిడ్-19 పాజిటివిటీ రేటు దాదాపు 1 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులతో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్క ఒమిక్రాన్ బాధితుడికి సైతం ఆక్సిజన్ అవసరం రాలేదు."
- సత్యేంద్ర జైన్, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి.
ప్రయాణాలపై ఆంక్షలు..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు అధికారులు. సిటీ బస్సులను 50శాతం కెపాసిటీతోనే నడుపుతున్నారు. బస్సుల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా.. భౌతిక దూరం పాటించేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఓ బస్ మార్షల్ వికాశ్. ప్రతిఒక్కరు మాస్క్ ధరించి కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఈ నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాపుల్లో ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటున్నారు.
మెట్రోలోనూ..
కొవిడ్ కట్టడికి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తున్న క్రమంలో.. దిల్లీ మెట్రోలోనూ 50 శాతం ప్రయాణికులనే అనుమతిస్తున్నారు అధికారులు. ట్రైన్లో నిలబడి ప్రయాణించకూడదని స్పష్టం చేశారు. సీటింగ్ కెపాసిటీ తగ్గించటం సరైన నిర్ణయమని, ప్రజలు సైతం కరోనా నియమాలు పాటించాలని ఓ ప్రయాణికుడు తెలిపారు.
50 శాతం ప్రయాణికులనే అనుమతిస్తున్న నేపథ్యంలో లక్ష్మీనగర్, అక్షర్ధామ్, గాజియాబాద్‌లోని షాహీద్ స్థల్ మెట్రో స్టేషన్ల ముందు భారీగా క్యూలైన్లు కనిపించాయి. మెట్రోలో వెళ్లేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయని వాపోయారు ప్రయాణికులు.
ఒడిశాలో మరో కేసు
విదేశాల నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చినట్లు ఒడిశా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. డిసెంబర్ 16న దుబాయ్ నుంచి భువనేశ్వర్‌కు వచ్చిన కియోంఝర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిని ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపింది. అతనిని కలిసి వారిని గుర్తిస్తున్నామని, అతని తల్లిదండ్రులకు నెగెటివ్ వచ్చినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ కలవరం
Covid vaccines India: భారత్‌లో 12కు చేరిన టీకాలు, ఔషధాల సంఖ్య