ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుణ్ని ఖజూరీ ఖాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్(22) అలియాస్ అర్మాన్‌గా గుర్తించారు.
తాను జైలుకు వెళ్లాలనే కోరికతో.. ఈ ఫోన్ కాల్ చేశానని నిందితుడు తమతో చెప్పాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. మాదక ద్రవ్యాలకు అతడు వ్యసనపరుడయ్యాడని చెప్పారు. 2018లో ఓ హత్య కేసులో జువైనల్ కరెక్షన్ హోమ్‌లో ఉండి.. విడుదలయ్యారని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో సల్మాన్ ఈ ఫోన్ చేశాడని పేర్కొన్నారు.
వెంటనే..
ఫోన్ కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై.. ట్రేస్ చేశామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం ఖజూరీ ఖాస్ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా జిల్లా పోలీసు విభాగానికి సమాచారమిచ్చామని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో.. ఫోన్ కాల్ చేసే సమయంలో సల్మాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. అంతకుముందు 10 గంటల ప్రాంతంలో తన తండ్రి అతడిని తిట్టాడని చెప్పారు.
'జైలుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావ్' అని ప్రశ్నించగా.. తనకు అక్కడ ఉండాలనిపిస్తోందని దర్యాప్తు సమయంలో సల్మాన్ చెప్పాడని సదరు సీనియర్ అధికారి వెల్లడించారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. ఇంటిలెజెన్స్ బ్యూరోతో కలిసి దిల్లీ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
ఇదీ చూడండి: 'యోగి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా'
ఇదీ చూడండి: ఆ రోజులు పోయాయ్: ప్రధాని మోదీ