భాజపా ఎంపీ గౌతం గంభీర్ కరోనా మందుల సేకరణపై ఔషధ నియంత్రణ అధికారి (డ్రగ్ కంట్రోలర్) సమర్పించిన నివేదికను దిల్లీ హైకోర్టు సోమవారం తీవ్రంగా తప్పుపట్టింది. 'న్యాయస్థానాన్ని మోసం చేయలేరు. ఏమి చెప్పినా అమాయకంగా నమ్ముతామని మీరు భావిస్తున్నట్లయితే అది తప్పు' అంటూ జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మండిపడింది. ఫాబిఫ్లూ మందును పెద్ద మొత్తంలో గంభీర్ సేకరించిన విధానంపై కోర్టుకు సమర్పించిన పరిశీలన నివేదిక సరిగాలేదని పేర్కొంది. ఔషధ నియంత్రణ అధికారి తమ విశ్వాసాన్ని దెబ్బతీశారని చెబుతూ ఆ నివేదికను తోసిపుచ్చింది.
'కరోనా నివారణకు వినియోగించే ప్రాణాధార మందులకు కొరత లేదని చెప్పవద్దు. సామాన్యులు వాటి కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో మాకు తెలుసు. మీరు, మీ అధికారులు ధర్మాసనం కళ్లు మూసుకోవాలని కోరుకుంటున్నారు. మీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించండి. లేదంటే సస్పెండ్ చేసి మరొకరిని నియమించాల్సి వస్తుంది' అని ఔషధ నియంత్రణ అధికారిని హెచ్చరించింది. పెద్ద మొత్తంలో మందులను సేకరించడం తగదని న్యాయస్థానం చెబుతున్నా తాను మళ్లీ అదే పని చేస్తానంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం ఆక్షేపించింది.
'సమస్యకు కారణమైన వారే ప్రజా రక్షకులుగా గొప్పలు చెప్పుకోవడం ఇటీవల ఓ ప్రవృత్తిగా మారింది. ఇలాంటి ధోరణి సమర్థనీయంకాదు. మళ్లీ అదే పని చేస్తానంటే..ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు' అని ధర్మాసనం పేర్కొంది. గంభీర్‌కు చెందిన ట్రస్ట్ సేకరించిన మందుల్లో 285 స్ట్రిప్పులు నిరుపయోగంగా ఉండటాన్ని ప్రశ్నించింది. వైద్య శిబిరం నిర్వహణ కోసమే మందుల్ని సేకరించారన్న అధికారి నివేదికలోని లోపాలను కోర్టు సహాయకుడు(అమికస్‌క్యూరీ) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మళ్లీ తగు పరిశీలన జరిపి మెరుగైన నివేదికను సమర్పించాలంటూ ఔషధ నియంత్రణ అధికారికి దిల్లీ హైకోర్టు మూడు రోజుల గడువునిచ్చింది. తదుపరి వాయిదాను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.