Brij Bhushan Sharan Singh Bail : మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ గురువారం జరగనుంది. అప్పటి వరకు బ్రిజ్ భూషణ్‌తో పాటు WFI ఉపకార్యదర్శి వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.25 వేల పూచీకత్తుతో బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసింది.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయగా.. ఈ కేసులో దిల్లీ పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితులకు సమన్లు జారీ చేసింది. మంగళవారం కోర్టుకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిజ్ భూషణ్‌తోపాటు వినోద్ తోమర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జూలై 20న విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకుండా బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Wrestlers Protest At Jantar Mantar : WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు జనవరిలో దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు చేపట్టారు. దిల్లీ పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులతోపాటు, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు చేసిన మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడం వల్ల పొక్సో కేసును తొలగించారు.
Brij Bhushan Sharan Singh Delhi Police : అంతకముందు బ్రిజ్ భూషణ్‌పై నమోదైన ఆరు కేసుల్లో.. ఇప్పటివరకు 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్ తయారు చేశామని చెప్పారు. ఈ క్రమంలో గత వారం దిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. మంగళవారం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రిజ్‌భూషన్ కోర్టుకు హాజరై.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదనలు విన్న దిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్, WFI ఉపకార్యదర్శి వినోద్ తోమర్‌కు రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.