దేశంలో సింగపూర్ రకం వైరస్‌తో మూడో దశ ముప్పు పొంచి ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. దిల్లీ సీఎం వ్యాఖ్యలు దేశానికి ఆపాదించవద్దని స్పష్టం చేశారు. కొవిడ్‌పై పోరులో సింగపూర్, భారత్ బలమైన భాగస్వాములు అని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరాలో దేశానికి సింగపూర్ ఎంతగానో సాయపడిందని కొనియాడారు.
మరోవైపు.. సింగపూర్ వైరస్ రకంపై దిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు గాను భారత హైకమిషనర్‌ను వివరణ ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం కోరిందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి తెలిపారు. కరోనా వేరియంట్లపై వ్యాఖ్యలు చేసే బాధ్యతలు దిల్లీ సీఎంకు లేవని సింగపూర్ ప్రభుత్వానికి హైకమిషనర్ స్పష్టం చేశారని చెప్పారు.
ఇదీ చూడండి: 'దేశంలోని కేసుల్లో కొత్త రకాలు పిల్లల్ని దెబ్బతీసేలా ఉన్నాయి'