ఆలయాలకు చెందిన భూములకు యజమాని దేవుడేనని సుప్రీంకోర్టు(supreme court of india) తీర్పునిచ్చింది. అర్చకులను భూస్వాములుగా పరిగణించకూడదని పేర్కొంది. అర్చకుడి పాత్ర ఆలయ నిర్వహణ మాత్రమేనని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆలయాలకు చెందిన ఆస్తులను అర్చకులు అక్రమంగా అమ్మకుండా ఉండేందుకు ఎంపీ లా రెవెన్యూ కోడ్, 1959 కింద.. వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం స్పష్టతనిచ్చింది.
"యజమానికి సంబంధించిన వివరాల్లో దేవుడి పేరు మాత్రమే ఉండాలి. భూముల్లో జరిగే కార్యకలాపాలను.. దేవుడు తరఫున ఇతరులు ఆ ఆలయాన్ని నిర్వహిస్తుంటారు. అందుకే అర్చకుడు, లేదా ఇంకవరి పేరూ అక్కడ ఉండకూడదు."
-- సుప్రీంకోర్టు.
పూజారి.. కౌలుదారు, అద్దెదారు కాదని చట్టాల్లో స్పష్టంగా ఉన్నట్టు పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. దేవుడి ఆస్తుల నిర్వహణలో విఫలమైతే ఆ వ్యక్తిని తప్పించవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారి, నిర్వాహకుడి పేరు ఉండాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:- 'పంజరంలో చిలకలాగే సీబీఐ.. దానికి స్వేచ్ఛ ఉండాలి'