కేరళలో ఒకే కుటుంబంలోని ఐదుగురు శవాలై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కన్నూరు జిల్లాలోని చెరుపుళ పడిచలిల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. చిన్నారుల మృతదేహాలు మెట్లపై ఉన్నాయని, దంపతులు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన దంపతులకు ఇటీవలే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.
జిల్లాలోని చెరువతూర్ ప్రాంతానికి చెందిన శ్రీజ.. తన రెండో భర్త షాజీతో కలిసి నివసిస్తోంది. ఆమెకు మొదటి భర్త సునీల్‌తో ముగ్గురు సంతానం ఉన్నారు. చిన్నారులు సూరజ్(12), సుజిన్(8), సురభి(6) ప్రస్తుతం తమ తల్లి శ్రీజతోనే ఉంటున్నారు. షాజీకి సైతం గతంలోనే ఓ వివాహం జరిగింది. అతడికి ఇద్దరు సంతానం ఉన్నారు. షాజీ, శ్రీజ.. కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. తమ జీవితభాగస్వాములకు విడాకులు ఇవ్వకుండానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. షాజీతో వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు సైతం అడ్డుచెప్పారని స్థానికులు తెలిపారు. అయితే, ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని తాము ఊహించలేదని అన్నారు.
శ్రీజకు కుటుంబ సమస్యలు ఉన్నాయని పోలీసులు సైతం వెల్లడించారు. ఇటీవలే శ్రీజను, ఆమె రెండో భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడినట్లు డిప్యూటీ ఎస్పీ కేఈ ప్రేమచంద్రన్ తెలిపారు. 'బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీజ పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్లో చెప్పింది. కానీ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం పరీక్షల తర్వాతే చిన్నారుల మృతిపై పూర్తి స్పష్టత వస్తుంది' అని ప్రేమచంద్రన్ వివరించారు.
ఏడుగురు మృతి
మరోవైపు, జమ్ము కశ్మీర్‌లోని కిస్త్వాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ ప్రాజెక్టు పనుల కోసం కార్మికులను తీసుకెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఘటనాస్థలిలో వర్షం కురిసినట్లు పోలీసులు తెలిపారు. వంపు తిరిగే సమయంలో వాహనం అదుపు తప్పి వందల అడుగుల లోతు ఉన్న లోయలోకి పడినట్లు వెల్లడించారు. డచ్చన్ ప్రాంతంలోని దంగదురు ప్రాజెక్టు పనుల కోసం బాధితులను తరలిస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.